12, ఆగస్టు 2017, శనివారం

అంతస్తులలో ఆకుపచ్చ సిరి



శుభోదయం ..మిత్రులారా !
నాకు చిన్నప్పటి నుండి మొక్కల పెంపకం చాలా ఇష్టం.  ప్రస్తుతం మా వసతి గృహం 30 అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు గల తూర్పు వరండా ,24 అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు గల ఉత్తరం వైపు వరండా నాలుగు కిటికీలు ,మూడు ద్వారాలు తెరుచుకునే స్థలంలో మూడవ అంతస్తు ఇనుప తడికెల రక్షణ వలయాల మధ్య ఒక చుక్క నీరు పడితే వినబడే కేకల మధ్య నా మొక్కల పెంపకం ఇష్టంగా సాగుతుంది. కేవలం నాలుగు గంటలు సూర్య రశ్మి సోకే ఈ వరండాలో చాలా వరకు ఇండోర్ ప్లాంట్స్,తూర్పు వైపున నాలుగైదు ట్రే లలో ఆకు కూరలు కొన్ని పూల మొక్కలు ఇదీ నా తోట పెంపకం. చేయి విసిరితే పడి మొలిచిన దోస మొక్క పెరిగి పెద్దది కాయలనిచ్చింది. పచ్చి మిర్చి పూత దశలో ఉంది. ఇవి కాకుండా కొన్ని పూల మొక్కలు నాకు ఆహ్లాదాన్నిస్తాయి.
ఫేస్ బుక్ లో  రఘోత్తమరెడ్డి  గారి మిద్దె తోట  స్పూర్తి తో మొక్కలకి చీడ పీడలు రాకుండా, రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా ..నా బాల్కనీ తోటని కాపాడుకుంటున్నాను. 
మన ఇంటి పంట ఆరోగ్యాన్ని,మన తోట మనకి ఆహ్లాదాన్ని ఇస్తూ పచ్చదనం ప్రక్కన మనసుకి సాంత్వన కలుగుతూ ఉంటుందని నా అనుభవం. 
భవిష్యత్తులో ఓ చిన్న పొదరిల్లు, దాని చుట్టూ ఓ తోట, ఆ తోటలో నాతో పాటు తిరిగే చిట్టి చిట్టి పాదాలు ఇది నాకల. సాధ్యమైనంత వరకూ పచ్చదనంతో  సాన్నిహిత్యం శారీరక,మానసిక ఆరోగ్యానికి మంచిదని నా నమ్మికతో .. ఈ చిరు ప్రయత్నం..   


మా బాల్కనీ గార్డెన్ వీడియో తీసి .. you tube లో ఉంచాను . ఈ లింక్  అంతస్తులలో ఆకుపచ్చ సిరి  ఇక్కడ చూడవచ్చు .